బాలుర హవా

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన ఎంసెట్-2019 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలోని టాప్-10 ర్యాంకుల్లో 7 ర్యాంకులు రంగారెడ్డి జిల్లా విద్యార్థులు కైవసం చేసుకోగా.. ఏపీ విద్యార్థులకు 3 ర్యాంకులు దక్కాయి. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలోని టాప్-10 ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులకు 4, ఏపీ విద్యార్థులకు 5 ర్యాంకులు లభించగా.. మరో ర్యాంకు తమిళనాడు విద్యార్థికి దక్కింది. ఇంజినీరింగ్ టాప్-10 ర్యాంకుల్లో 9 ర్యాంకులను బాలురు కైవసం చేసుకోగా.. మరో ర్యాంకు బాలికకు లభించింది. అగ్రికల్చర్, ఫార్మసీ టాప్-10 ర్యాంకుల్లో బాలురకు 5, బాలికలకు 5 ర్యాంకులు లభించాయి.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసెట్ కమిటీ చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య పాల్గొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 82.47 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 93.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించిన ఎంసెట్‌కు ఇంజినీరింగ్ విభాగంలో 1,42,210 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా.. 1,31,209 మంది హాజరయ్యారు. వారిలో 1,08,213 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,989 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా.. 68,550 మంది హాజరయ్యారు. వారిలో 63,758 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

Tags: TSemcet2019, emcetresults2019

Share This Post
0 0

Leave a Reply