14 ఏళ్లు సీఎంగా చేశాను… అలా చేస్తుంటే బాధ ఉండదా?: చంద్రబాబు

babu

తాను పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తినని, అటువంటి తనను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకుంటూ ఉంటే బాధగా ఉండదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ ఆవరణలో నిన్న జరిగిన ఘటనలపై నేడు వివరణ ఇచ్చిన చంద్రబాబు, తాను బాధలో గట్టిగా మాట్లాడానే తప్ప ఎవరినీ ఉద్దేశించి ఏమీ అనలేదని అన్నారు. ఇప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి, గతంలో తనను బుద్దీ, జ్ఞానం లేనివాడినని అన్నారని, నడిరోడ్డుపై కాల్చి పారేయాలని కూడా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.

తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలోకి వస్తుంటే, గేటును మూసివేసిన అడ్డుకున్నారని, ఆ సమయంలో వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ అని అరిచానని అన్నారు. మార్షల్స్ తనను అడ్డుకోవడం తప్పుకాదా? అని ప్రశ్నించారు. ఓ ఉన్మాది వంటి సీఎం ఇక్కడ ఉన్నారని, అతన్ని చూసి మిగతావారూ అలాగే తయారవుతున్నారని మండిపడ్డారు.

ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని కల్పించుకుని, కొన్ని అన్ పార్లమెంటరీ, డిరోగేటరీ లాంగ్వేజ్ వీడియోల్లో కచ్చితంగా ఉందని అన్నారు. అందులో ఎటువంటి సందేహమూ లేదని స్పష్టం చేశారు. వీడియోలు చూసిన తరువాత చంద్రబాబు మాటలకు పక్కాగా ఆధారాలు ఉన్నాయని అన్నారు. సభ్యుల ఆవేదనను చూసిన తరువాతైనా, ఓ సీనియర్ నేతగా ‘ఐయామ్ సారీ ఫర్ ఇట్’ అని చెబితే హుందాగా ఉంటుందని హితవు పలికారు.

Share This Post
0 0

Leave a Reply