సుర్రుమంటున్న సూర్యుడు

రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇంటినుంచి బయటకు అడుగుపెట్టాలంటే జనం జంకుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. బుధవారం రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 41 డిగ్రీలచొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 40.8 డిగ్రీల చొప్పున, వనపర్తిలో 40.7 డిగ్రీలు, మహబూబ్‌నగర్, నారాయణపేట, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 40.6 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో వారంపాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణస్థాయి కంటే రెండుడిగ్రీల వరకు పెరుగుతాయని చెప్పారు.

హైదరాబాద్‌లో ఈ ఏడాది గరిష్ఠంగా బుధవారం 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒకటి రెండురోజుల్లో 40 డిగ్రీలు దాటొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణస్థాయి కంటే 8 డిగ్రీలు పెరిగి 39 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని తెలిపారు. పగటిఉష్ణోగ్రతలు పెరుగడంతో మధ్యాహ్నం సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

Share This Post
0 0

Leave a Reply