సన్‌షైన్‌లో అరుదైన ఆపరేషన్‌

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సన్‌షైన్‌ దవాఖాన వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. బాంబుపేలుడులో యెమెన్‌కు చెందిన సువాద్‌ అహ్మద్‌ హమీద్‌ (24) అనే మహిళకు తొడఎముక 15 సెంటీమీటర్ల మేర నుజ్జునుజ్జయింది. యెమెన్‌లోనే ప్లేట్‌ను అమర్చిన్నప్పటికీ అది విఫలమైంది. నడువలేని స్థితిలో ఆమె సన్‌షైన్‌ వైద్యులను ఆశ్రయించారు. ఆమెకు మాడిఫైడ్‌ కపానాస్‌ టెక్నిక్‌ ద్వారా మైక్రోవాస్కులర్‌ అల్లోగ్రాఫ్ట్‌ పద్ధతిలో తొడఎముకను కొత్తగా అమర్చినట్టు సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ ఏవీ గురువారెడ్డి తెలిపారు. ఇలాంటి ఆపరేషన్‌ నిర్వహించడం తెలుగురాష్ర్టాల్లో ఇదే మొదటిసారని చెప్పారు.

కపానాస్‌ విధానం అంటే..
ప్రమాదవశాత్తు ఎముకను కోల్పోయినవారికి సాధారణంగా డిస్ట్రాక్షన్‌ ఆస్టియోజెనెసిస్‌, మాస్క్యులైటిస్‌ విధానాల్లో చికిత్సచేస్తారు. బెంగళూరులోని ఎముకబ్యాంక్‌ నుంచి అల్లోగ్రాఫ్ట్‌ అనే ఫీమర్‌ ఎముకను తెప్పించారు. ఆ మహిళ రెండో కాలిపిక్క భాగంలో ఉండే ఫిబియాలోని కొంత భాగాన్ని తీసుకుని దీనికి అమర్చారు. ఈ రెండు ఎముకలను ఒక ప్లేట్‌ సహాయంతో నుజ్జునుజ్జయిన ఎముకస్థానం లో అమర్చారు. ఈ ఆపరేషన్‌కు 17 గంటల సమయం పట్టింది. సువాద్‌ ఇప్పుడు వాకర్‌ సహాయంతో నడువగలుగుతున్నది. ఆరువారాల తర్వాత ఆమె ఎడమకాలిపై బరువు తట్టుకునే సామర్థ్యం పొందగలుగుతారని ఆపరేషన్‌ నిర్వహించిన డాక్టర్‌ వాసుదేవ జువ్వాడి తెలిపారు. ఈ ఎముక అతుక్కుని కాలు సాధారణ స్థితికి రావడానికి ఎనిమిది నెలల సమయం పడుతుందని చెప్పారు.

Share This Post
0 0

Leave a Reply