రాష్ట్రంలో తగ్గిన నేరాలు

రాష్ట్రంలో నేరాలు తగ్గినట్టు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తుండటం, నిఘాను పెంపొందించడంతో వ్యవస్థీకృత నేరాలు అదుపులోకి వచ్చినట్టు స్పష్టమవుతున్నది. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2015లో తెలంగాణలో మొత్తం 1,22,778 కేసులు నమోదుకాగా.. 2016లో వీటి సంఖ్య 1,20,273కు తగ్గింది. ఇదే సమయంలో కేరళలో కేసుల సం ఖ్య 6,53,408 నుంచి 7,07,870కు, ఉత్తరప్రదేశ్‌లో 4,74,559 నుంచి 4,94,025కు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది.

మన హైదరాబాద్ సేఫ్
దేశంలోని అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉన్నది. దేశంలోనే అతితక్కువ క్రైంరేట్(2.7శాతం)తో హైదరాబాద్ సురక్షిత నగరంగా నిలిచింది. నాగ్‌పూర్, కోయంబత్తూరు లాంటి పట్టణాల కంటే హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరమని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2015-17 మధ్య హైదరాబాద్‌లో నేరాలు 14 శాతం తగ్గాయి. ఇదే సమయంలో ఢిల్లీలో 40.4 శాతం, బెంగళూరులో 8.9 శాతం, ముంబైలో 7.2 శాతం, చెన్నైలో 3.6 శాతం చొప్పున నేరాలు పెరుగడం గమనార్హం. ప్రత్యేకించి మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. షీ టీమ్స్, షీ షటిల్, ప్రత్యేక తనిఖీ బృందాల నిఘాతో హైదరాబాద్‌లో మహిళలపై నేరాలు 13.5 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గినట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఉమెన్ సేఫ్టీవింగ్‌ను ఏర్పాటుచేసి ఐజీ ర్యాంకు అధికారిని ప్రత్యేకంగా నియమించడంతో మహిళల్లో భరోసా పెరుగుతున్నది. పని ప్రదేశాల్లో జరిగే లైంగికదాడులపై వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. 2016లో 24 శాతం మంది ఇలాంటి ఫిర్యాదులు చేయగా.. 2017లో ఇది 30 శాతానికి పెరిగింది.

Share This Post
0 0

Leave a Reply