రజనీ తోడుంటే… విజయం మనవెంటే

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట ఓటమిపై భాజపా రాష్ట్ర నాయకత్వం డివిజన్ల స్థాయిలో నిర్వహిస్తున్న అంతర్గత సమీక్ష సమావేశాల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయన తోడుంటే భవిష్యత్తు ఎన్నికల్లో తమ పార్టీకి రాష్ట్రంలో విజయం సునాయసమేనని పలువురు నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఈ సమీక్షల్లో పలువురు నేతలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో అన్ని డివిజన్ల అంతర్గత సమీక్షలు ముగిసిన తర్వాత దిల్లీలోని అధిష్ఠానానికి రాష్ట్ర నాయకత్వం నివేదిక పంపనుంది. అందులో రజనీకాంత్‌తో పొత్తు వ్యవహారాన్ని ప్రముఖంగా ప్రస్తావించనుందని సమాచారం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్నాడీఎంకే- భాజపా కూటమి ఘోర పరాజయానికి కారణాలను గుర్తించి విశ్లేషించడానికి డివిజన్ల స్థాయిలో అంతర్గత సమీక్షలు నిర్వహించి నివేదిక పంపాలంటూ రాష్ట్ర శాఖను అధిష్ఠానం ఆదేశించింది. ఆ మేరకు ఈ నెల 7న చెన్నై, 8న కాంచీపురంలో ఈ సమీక్షలు జరిగాయి. ఇందులో తమ పార్టీ అభ్యర్థుల ఓటమికి పలు కారణాలను భాజపా నిర్వహకులు ఏకరవు పెట్టారు. భాజపా అభ్యర్థుల విజయానికి అన్నాడీఎంకే నిర్వాహకులు, కార్యకర్తలు సక్రమంగా సహకరించలేదని ప్రధానంగా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత డీఎంకే విజయానికి బాటలు పరిచిందని అభిప్రాయపడ్డారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మూడో కూటమి ఏర్పాటు చేసి పొందిన ఓట్లనే ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమిలో ఉంటూ సాధించామని ప్రస్తావించారు. అవినీతి నిర్మూలన ప్రధాన అజెండాగా పాలన సాగిస్తున్న భాజపా రాష్ట్రంలో మాత్రం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటు చేయడాన్ని ప్రజలు ఆమోదించలేదన్నారు. శశికళ కుటుంబంతో పాటు ప్రస్తుత పాలకులపై ఉన్న అవినీతి ఆరోపణలపై తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ఎన్నికల్లో భాజపా ఓటమికి కారణమయ్యాయని వివరించారు.

Tags: Rajanikath, BJP, parlament elections 2019

Share This Post
0 0

Leave a Reply