మోదీ, షాతో మోహన్‌బాబు భేటీ

ప్రధాని మోదీ తనను బీజేపీలోకి ఆహ్వానించడంపై తానిప్పుడేమీ మాట్లాడనని ప్రముఖ నటుడు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ప్రధానితో ఏం మాట్లాడానో, ఏం జరిగిందో డబ్బా కొట్టుకోవడం తనకు చేతకాదన్నారు. ఆ రోజు వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని విలేకరులతో అన్నారు. సోమవారమిక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తొలుత మోదీతో, రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు ఇద్దరు గొప్ప వ్యక్తులను కలిశాను. మన ప్రధాని దేశాన్ని ప్రపంచంలో గొప్ప స్థానంలో ఉంచారు. హోం మంత్రి తన పదవికే వన్నె తెచ్చిన నేత. వీరిద్దరూ మాకు ఎక్కువ సమయం ఇచ్చి మాట్లాడడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అంతటి ప్రేమానురాగాలను పొందడం కంటే నాకు ఇంకేం కావాలి? నేను ఇదివరకు వైసీపీ అధినేతను జగన్‌ అని పిలిచేవాడిని.. సీఎం అయ్యాక జగన్‌ గారూ అని సంబోధిస్తున్నాను. ఎవరు ఆ కుర్చీలో ఉన్నా గౌరవించాలి. వారిని కాదని నేను ఢిల్లీకి రాలేదు’ అని వ్యాఖ్యానించారు. తనకు మోదీ అంటే చాలా చాలా ఇష్టమన్నారు. టీడీపీలో ఉంటూ 1997లోనే బీజేపీ తరఫున ప్రచారం చేశానని చెప్పారు. త్వరలో దక్షిణాది నటులతో భేటీ కానున్నట్లు ప్రధాని చెప్పారని విష్ణు తెలిపారు.

Share This Post
0 0

Leave a Reply