భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి?

దేవుణ్ణి ఎవరు ఏదైనా కోరుకోవచ్చునని అనుకొంటారు. ఏది నిజమైన, సవ్యమైన కోరిక? స్వీయాత్మకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పు లేదు. ఆ తర్వాతైనా న్యాయమైన, ధర్మమైన కోర్కెలు కోరాల్సి ఉంటుంది. చాలామంది తమకు అధిక ధనధాన్యాలు కావాలని, సుఖసంతోషాలు కలగాలని.. ఇలా రకరకాల నిత్యజీవిత సంబంధమైన లౌకిక కోర్కెలే ఎక్కువగా కోరుకుంటుంటారు. భగవంతుడు వీటిని తీరుస్తాడా? అంటే, తీర్చవచ్చు లేదా తీర్చకపోనూ వచ్చు. దేవుడే ప్రత్యక్షమై ఏం కావాలి? అని అడిగినపుడు అజ్ఞానులు మాత్రమే స్వార్థపరమైన, అశాశ్వతమైన సుఖాలను ఇచ్చే వరాలను ఆశిస్తారు. మోక్షాన్ని ప్రసాదించాలని, పాపాలను కడిగేసి జన్మరహితమైన స్వర్గప్రాప్తిని అందించమనే వారూ ఉంటారు. కానీ, లోకకల్యాణం కోసం దేవుణ్ణి ప్రార్థించే వారు చాలా అరుదుగా ఉంటారు.

మీ కోసం దేవుణ్ణి వేడుకోవడం కన్నా పరుల కోసం ప్రార్థించడంలో ఉత్తమ వ్యక్తిత్వం, అద్భుతమైన తృప్తి, మానసిక ప్రశాంతత ఉంటా యి. మనమేది కోరుకున్నా, దేవుడు మనకిచ్చిన దానినే మనదిగా స్వీకరించాల్సిన మనసును కూడా మనం అలవర్చుకోవాలి. అప్పుడు మన కోర్కెల్ని తీర్చలేదన్న బాధా ఉండదు. మనం న్యాయసమ్మతంగా ఉంటూ, ధర్మబద్ధంగా జీవనం సాగిస్తున్నంత కాలం మనకు లభించే ఏవైనా సరే అవి దేవుడిచ్చినవిగానే, సవ్యమైనవిగానే భావించాలి. ఇప్పుడు నిర్ణయించుకోండి, పూజ చేసే సమయంలోనో లేదా గుడికి వెళ్లినప్పుడో దేవుణ్ణి మీరు ఏం కోరుకోవాలో!

Share This Post
0 0

Leave a Reply