ప్లాస్టిక్ నిషేధం దిశగా టీటీడీ కీలక నిర్ణయం

ఏడుకొండలవాడి సన్నిధిలో ప్లాస్టిక్‌ నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి రంగం సిద్ధం చేస్తోంది టీటీడీ. మూడు దశల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా కొండపై కనిపించకుండా చేయాలని భావిస్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. తిరుమల గిరులు నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక స్వామి సన్నిధిలో ప్లాస్టిక్‌ వాడకం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్వామి వారి ప్రసాదం తీసుకెళ్లేందుకు ఇప్పటివరకూ ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగించేవారు. వీటిని కౌంటర్ల వద్ద భక్తులకు విక్రయించేవారు. అయితే తాజాగా వాటి స్థానంలో పేపర్‌ బాక్సులను అదుబాటులోకి తెచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఒక్క లడ్డూ బాక్స్‌కు 3 రూపాయలు, రెండు లడ్డూల బాక్స్‌కు 5 రూపాయలు, 4 లడ్డూల బాక్స్‌కు 10 రూపాయలుగా ధరను నిర్ణయించింది. అయితే టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న భక్తులు.. బాక్సుల ధరలు కాస్త తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి శ్రీవారి సన్నిధిలో అంచెలంచెలుగా ప్లాస్టిక్‌ను పూర్తిగా కనుమరుగు చేయాలని కంకణం కట్టుకుంది టీటీడీ. పాలకమండలి నిర్ణయంతో మూడు దశల్లో ఈ పనిని పూర్తి చేస్తామని చెబుతోంది.

Share This Post
0 0

Leave a Reply