పక్కింట్లో ఉన్నాయనను కలిస్తే పార్టీ మారుతున్నట్టా?

ఈనెల 17వ తేదీన తాను బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడేది లేదన్నారు. గోడ మీద పిల్లి లాగా ఉండబోనన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న షకీల్.. ‘‘నేను గతంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఎంపీ అరవింద్ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుంది. అలా ఆయన్ని కలిశాను. అరవింద్‌‌ను కలిస్తే తప్పేంటి? డి. శ్రీనివాస్ కూడా మా ఇంటికి వచ్చి వెళ్తుంటారు. నేను పార్టీ మారితే బావుండునని మా వాళ్లు కొందరు ఆనందపడ్డారు’’ అని చెప్పుకొచ్చారు.

అయితే తాను బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను షకీల్ ఖండించారు. ఓ ముస్లిం ఎమ్మెల్యేగా ఏ విధంగా బీజేపీలో చేరుతానని అనుకుంటున్నారు అంటూ మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. ఇదే సమయంలో తనపై కేసులు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను షకీల్ ఖండించారు. తన మీద ఒక్క కేసు ఉన్నట్లు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గతంలో తనపై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషిగా నిరూపించుకున్నానని తెలిపారు.

Share This Post
0 0

Leave a Reply