పంచాయతీకి చాటింపు

Gram-panchayat-S9tv

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు. మొత్తం 12,732 గ్రామాలు, 1,13,170 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,13,190 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో విడుత ఎన్నికలను 14 రోజుల్లో పూర్తిచేస్తామని చెప్పారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. ప్రభుత్వం కొత్తగా ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ప్రకటించరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేశారు. రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలు ఉండగా 17 గ్రామాలకు పదవీకాలం పూర్తికాలేదని, మరో 2 గ్రామాలకు సంబంధించిన కోర్టు కేసులు ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ 19 గ్రామాలను మినహాయించి 12,732 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు వివిధ శాఖల సమన్వయంతో పటిష్ఠమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి మొదటి విడుత ఎన్నికలు ప్రారంభం అవుతాయన్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఓటరు జాబితాలో వరుస సంఖ్య, ఎపిక్ కార్డుతోపాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. ముందుగా వార్డుస్థానాల ఓట్లు లెక్కిస్తామని, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కిస్తామని చెప్పారు. ఉప సర్పంచ్ ఎన్నిక సైతం అదేరోజు ఉంటుందని, చేతులు ఎత్తే పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందని వివరించారు.

Tags: Schedule Notified , Panchayat Polls , Telangana , Telangana Election Commissioner V Nagi Reddy

Share This Post
0 0

Leave a Reply