నేడే ‘చలో ట్యాంక్‌బండ్‌’

చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జేఏసీ కో-కన్వీనర్‌ కె.రాజిరెడ్డి గుర్తు తెలియని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనంలో ఆయనను తరలించినట్లు కార్మిక నేతలు ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌ను కూడా ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్‌లో 50 మంది, తొర్రూరులో 25 మందిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. దీంతో జేఏసీ ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులకు చిక్కకుండా ఉండడానికే వారు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. శనివారం జరిగే చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో ప్రత్యక్షమవుతారని సమాచారం.

బీజేపీ, కాంగ్రెస్‌, అఖిలపక్షం మద్దతు
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు శనివారం ‘చలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 35 రోజులుగా సాగుతున్న సమ్మెను మరింత ఉద్ధృతం చేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. మిలియన్‌మార్చ్‌ తరహాలో చలో ట్యాంక్‌బండ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు రాజకీయ పార్టీల నేతలు కూడా చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి హాజరుకానున్నారు. టీజేఎస్‌, ఎమ్మార్పీఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, సీపీఎం(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, జనసేనతో పాటు విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి.

Share This Post
0 0

Leave a Reply