నాన్న ఈ పని ముందే చేయాల్సింది: సోనాక్షి

తన తండ్రి శతృఘ్న సిన్హా భాజపాను వీడడాన్ని ఆయన కూతురు, బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సమర్థించారు. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు తెలిసి నాన్న ఈ పని(పార్టీని వీడడం) ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఆయనకు తగిన గౌరవం లభించలేదు. అడ్వాణీ, అటల్‌ జీ కాలం నుంచి మా నాన్న పార్టీలో ఉన్నారు. వారెవ్వరికీ పార్టీలో తగిన గౌరవం లభించలేదు. కాంగ్రెస్‌లో చేరడం ఆయన(శతృఘ్న) ఇష్టం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు సరిగా లేవని భావించినప్పుడు ఎవరైనా మార్పు కోరుకోవాల్సిందే. ఇప్పుడు ఆయన చేసిందీ అదే ’’ అని సోనాక్షి అభిప్రాయపడ్డారు.

గత కొంత కాలంగా భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎంపీ శతృఘ్న సిన్హా ఎట్టకేలకు పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని గురువారం కలిసిన ఆయన భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్‌ 6న అధికారికంగా ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. అలాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నా సాహిబ్‌ స్థానం నుంచే మళ్లీ పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ ఆ స్థానాన్ని ఆయనకు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బిహార్‌లో పొత్తుల్లో భాగంగా పట్నా సాహిబ్‌ సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. తొలుత ఈ స్థానంపై ఆర్జేడీ పట్టుబట్టినప్పటికీ.. నిన్న జరిగిన రెండో విడత సీట్ల సర్దుబాటులో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది.

Share This Post
0 0

Leave a Reply