దంచికొట్టిన గాలివాన

రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సోమవారం సాయంత్రం వర్షం పడింది. కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా మరికొన్నిచోట్ల జల్లులు పడ్డాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం మధ్యాహ్నం వరకు దంచికొట్టిన ఎండలు.. సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకోగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెట్లు కూలడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుకు బాలిక కన్నుమూసింది. జగిత్యాల జిల్లాలో పౌల్ట్రీ ఫారం ధ్వంసం కావడంతో వెయ్యికిపైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. అక్కడక్కడ పిడుగులు పడగా పశువులు మరణించాయి. భీకర గాలులకు అనేక చోట్ల ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ వర్షం దంచి కొట్టింది. చాలాచోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమై వరద నీటిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Share This Post
0 0

Leave a Reply