డిజిటల్‌ మీడియాకు కళ్లెం!

డిజిటల్‌ మీడియాకు కళ్లెం వేసేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నది. తొలిసారిగా న్యూస్‌ వెబ్‌సైట్లను సైతం అధికారిక నియంత్రణల పరిధిలోకి తెచ్చేందుకు సమాయత్తమవుతున్నది. న్యూస్‌ వెబ్‌సైట్ల రిజిస్ట్రేషన్‌ ఇకపై తప్పనిసరి కానుంది. ఈ మేరకు బ్రిటిష్‌ కాలం నాటి ‘ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బుక్స్‌(పీఆర్‌బీ)యాక్ట్‌-1867’కి చెల్లుచీటీ రాసి, దాని స్థానంలో ‘రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ అండ్‌ పీరియాడికల్స్‌ బిల్లు-2019’ ను ప్రవేశపెట్టనుంది. బిల్లు ముసాయిదాను ఇప్పటికే రూపొందించిన కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ.. అభిప్రాయాలను కోరేందుకు దానిని సోమవారం ప్రజలకు అందుబాటులో ఉంచింది. తదుపరి 30 రోజుల్లోగా ముసాయిదాపై ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తంచేయవచ్చు. డిజిటల్‌ మీడియా నియంత్రణకు మోదీ సర్కారు చేపట్టిన రెండో చర్య ఇది.

న్యూస్‌ వెబ్‌సైట్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 శాతానికే పరిమితం చేస్తున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర క్యాబినెట్‌ వెల్లడించింది. పబ్లిషర్ల ప్రాసిక్యూషన్‌కు సంబంధించి గత చట్టంలో పొందుపరిచిన నిబంధనలను తొలిగించాలని తాజా బిల్లు ప్రతిపాదిస్తున్నది. అలాగే పబ్లిషర్లు/ప్రింటర్లు జిల్లా మెజిస్ట్రేట్‌ ఎదుట డిక్లరేషన్‌ ఇచ్చే పద్ధతిని కూడా రద్దు చేయనుంది. మరోవైపు, కొత్తగా ఏర్పాటుచేయబోయే ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియనూ సులభతరం చేయనుంది. ముసాయిదా బిల్లు ప్రకారం.. డిజిటల్‌ మీడియా పబ్లిషర్లు తప్పనిసరిగా ‘రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌ ఆఫ్‌ ఇండియా’ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్‌ ఫార్మాట్‌లో ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ లేదా మొబైళ్లలో టెక్ట్స్‌, ఆడియో, వీడియో, గ్రాఫిక్‌ రూపంలో ప్రసారమయ్యే వార్తలను డిజిటల్‌ మీడియా న్యూస్‌గా బిల్లులో నిర్వచించారు. మరోవైపు, పబ్లిషర్‌ ఎవరైనా ఉగ్రవాద చర్యలు, లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఏదైనా న్యాయస్థానం నిర్ధారిస్తే.. సంబంధిత పబ్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేయనున్నారు.

Share This Post
0 0

Leave a Reply