జనవరి నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ

నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌సిటూ పద్ధతిలో నిర్మించిన కాలనీల్లో లబ్ధిదారుల ఎంపిక ఇదివరకే పూర్తయినందున ముందుగా ఈ కాలనీలను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. అనంతరం ఖాళీ జాగాల్లో పూర్తయిన కాలనీలను కూడా దశలవారీగా పంపిణీ చేయాలని నిశ్చయించారు.

నగరంలోని పేదల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఒక లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టగా, సుమారు 11వేల ఇళ్లు పూర్తయ్యాయి. అందులో రాంపల్లి, అహ్మద్‌గూడల్లోని ఖాళీజాగాల్లో నిర్మించినవే దాదాపు పదివేల ఉన్నాయి. ఇవికాకుండా ఇన్‌సిటీ పద్ధతిలో సింఘంచెరువు తండా, గాజులరామారం, అమీన్‌పూర్-1, జమ్మిగడ్డ, ఖిడికీ బూత్ అలీషా, సయద్ సాబ్ కా బాడా తదితర చోట్ల మరో వెయ్యి ఇండ్లు పూర్తయ్యాయి.

పూర్తయిన ఇళ్ల కాలనీలకు విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ రెండు నెలల్లో ఈ సౌకర్యాలు కల్పించి దశలవారీగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముందుగా ఇన్‌సిటూ కాలనీల్లోని 1000 ఇళ్లను పంపిణీ చేయాలని నిశ్చయించిన అధికారులు, వాటిల్లో మంచినీరు, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.10 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Share This Post
0 0

Leave a Reply