చిరంజీవి ఆధ్వర్యంలో సీఎం జగన్ ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు

ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున, రాజమౌళి, సి.కల్యాణ్, సురేశ్ బాబు, దిల్ రాజు, వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ సీఎంతో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై తమ అభిప్రాయాలను వినిపించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తగిన ప్రణాళికలపై జగన్ కు వివరించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని టాలీవుడ్ ప్రముఖులు కోరారు. టాలీవుడ్ ప్రతినిధుల విజ్ఞప్తులకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

కాగా, నంది అవార్డులు, వినోదపన్ను మినహాయింపు, రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి అవసరమైన వసతుల కల్పన, భూములపై రాయితీ, చిత్ర నిర్మాణాలకు ప్రోత్సాహకాలు, ప్రత్యేక అనుమతులు వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అటు, ఏపీలో ఉచిత షూటింగ్ నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Share This Post
0 0

Leave a Reply