ఏపీ తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమయ్యింది. ఉదయం 10.30 గంటలకు వెలగపూడిలోని సమావేశ మందిరంలో భేటీ మొదలయ్యింది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి పలు హామీల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం నేపథ్యంలో తొలి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఎనిమిది అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవం రోజు వృద్ధుల పింఛన్‌ మొత్తాన్ని రూ.2250కి పెంచుతూ జగన్‌ తొలి సంతకం చేశారు. సీఎం తన చాంబర్లోకి ప్రవేశించినప్పుడు ఆశ వర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో సంతకం చేశారు. అక్టోబరు 15 నుంచి ఏడాదికి రూ.12,500లు రైతుకు సాయంగా అందించే ‘రైతు భరోసా’ పథకానికి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.

సచివాలయంలో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఐఆర్‌ ప్రకటన, సీపీఎస్‌ రద్దు అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలిపారు. వీటితోపాటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, హోంగార్డు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైన అంశాలపైనా చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ భేటీ తర్వాత ఎటువంటి ప్రకటనలు వెలువడనున్నాయా? అన్న ఆసక్తి నెలకొంది.

Share This Post
0 0

Leave a Reply