ఇకపై.. ఏటా డీఎస్సీ: మంత్రి సురేశ్‌ హామీ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఆదివారం విజయవాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో ‘ప్రభుత్వ విద్యా సంస్కరణలపై రాష్ట్రస్థాయి సదస్సు’ నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు హాజరైన మంత్రి సురేశ్‌ మాట్లాడుతూ, విద్యాశాఖలోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా పూర్తి చేసేందుకు మండల విదాశాఖాధికారుల వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు చెప్పారు. ఎంఈవోలకు సెల్ఫ్‌ డ్రాయింగ్‌ పవర్‌ ఇచ్చేందుకు, ఎంఈవోలకు సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా ఉప విద్యాశాఖాధికారులుగా పదోన్నతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. అన్ని పాఠశాలల్లో ‘నో బ్యాగ్‌ డే’ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మండల విద్యాశాఖాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం మాట్లాడుతూ, ఎంఈవోల డిమాండ్లను మంత్రికి వివరించారు. ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post
0 0

Leave a Reply