ఉద్రిక్తంగా మారుతున్న ఆర్టీసీ సమ్మె

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 18వ రోజుకు చేరుకుంది. డిమాండ్ల పరిష్కారం విషయంలో ఆర్టీసీ కార్మికులు ఎంత పట్టుదలతో ఉన్నారో… ప్రభుత్వం తన వాదనను వినిపించడంలోనూ అంతకంటే ఎక్కువ పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే హైకోర్టు జోక్యం చేసుకున్నా ఇప్పటి వరకూ ఆర్టీసీ సమ్మెకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు మరోసారి స్పష్టం చేసారు.

గవర్నన్ తమిళసైను కలిసిన జేఏసీ నేతలు కోర్టు ఆదేశాలు, సమ్మె నోటీసు డిమాండ్ లను వివరించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నేడు వంటావార్పునకు అఖిలపక్షాలు పిలుపునిచ్చాయి. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారింది. తనపై ఆర్టీసీ కార్మికుడు దాడి చేశారంటూ తాత్కాలిక డ్రైవర్‌ ఆరోపిస్తున్నాడు. దీంతో కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లపై దాడి చేశారు ఆర్టీసీ కార్మికులు. అనంతరం బస్సుపైకి ఎక్కిన ఓ కార్మికుడు కిందకు దూకబోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు అడ్డుకుని కార్మికుడిని కిందకు దించారు. సమ్మెలో భాగంగా కార్మికులు రోడ్డుపై ఆందోళనలు చేపట్టారు. అ క్రమంలో అటుగా వచ్చిన బస్సుపై దాడి చేశారు కార్మికులు. ఈ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. వికారాబాద్‌లో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

హైదరాబాద్ నుండి వికారాబాద్‌ వస్తున్న బస్సును చేవెళ్ల దగ్గర అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ బస్సులు నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ సీపీ అంజన్‌కుమార్. విధుల్లో ఉన్న డ్రైవర్లకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌లో విచారణ జరిపించి వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు సీపీ అంజన్‌కుమార్.

Share This Post
0 0

Leave a Reply