ఈ దశాబ్దం తెలంగాణదే

ఈ దశాబ్దం తెలంగాణదేనని, టీఆర్‌ఎస్‌ నాయకత్వంలో దేశానికి మార్గదర్శకంగా రాష్ట్రం నిలువబోతున్నదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మున్సిపల్‌ చట్టాన్ని సమర్థంగా అమలుచేయడమే ఈ సంవత్సరం తన లక్ష్యమని తెలిపారు. సంస్థాగతంగా టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు మున్సిపల్‌ ఎన్నికలు పూర్తికాగానే జనవరి చివరినుంచి జిల్లా పార్టీ కార్యాలయాలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. మరో పదేండ్లు సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించారని గుర్తుచేస్తూ.. ఇంకా సీఎం మార్పుపై ఊహాగానాలు ఎందుకని ప్రశ్నించారు. నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్‌ బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కేటీఆర్‌ స్పందన ఆయన మాటల్లోనే..

2020 కూడా టీఆర్‌ఎస్‌దే

2018 చివరిలో అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలతో 2019 సంవత్సరాన్ని ఆరంభించుకున్నాం. టీఆర్‌ఎస్‌ భారీసంఖ్యలో సీట్లు గెలిచి.. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయ్యారు. 2020 కూడా ఆదేరకమైన ఆరంభాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. 2019 టీఆర్‌ఎస్‌దే. 2020 కూడా టీఆర్‌ఎస్‌దే. 2020-2030 దశాబ్దం తెలంగాణది. ఈ దశకం తెలంగాణది కావాలని, దేశంలోనే ఒక ఆదర్శ, అగ్రశేణి రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకోవాలని, అందులోనూ టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ నాయకత్వంలోనే పురోగమించాలని కోరుకుంటున్నాం. ఈ నెలలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో సింహభాగం మున్సిపాలిటీలను, వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుంది. సర్పంచ్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో సింహభాగం గెలుచుకున్నాం. జెడ్పీ చైర్మన్లను వందశాతం గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించాం. అదేస్థాయిలో మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు వస్తాయి. మంచి శుభారంభం ఉంటుంది. 2019 చాలా ఉత్సాహంగా సాగింది. 2019లో ఏ ఎన్నిక వచ్చినా గెలిచాం. గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయాలు, పార్టీ సభ్యత్వ నమోదుద్వారా టీఆర్‌ఎస్‌ ఎంత బలంగా ఉన్నదో అంచనా వేయవచ్చు.

Share This Post
0 0

Leave a Reply