ఇల్లు కొనే వారికి శుభవార్త.. రిజిస్ట్రేషన్ అయిన గంటలోనే చేతికి పేపర్లు.

ఇండ్లు, ప్లాట్లు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్, వాటి పేపర్లు చేతికి అందడం.. ఇదంతా పెద్ద తతంగమే. రిజిస్ట్రేషన్ ఒక ఎత్తైతే, పేపర్లు చేతికి అందడం మరో ఎత్తు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యి, ఆ పేపర్లను స్కాన్ చేసిన తర్వాత వాటిని మనకు అందజేస్తారు. ఆ పేపర్ల కోసం రోజుల తరబడి మనం రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖ కీలక సంస్కరణలు చేపట్టబోతోంది. రిజిస్ట్రేషన్‌ అయిన గంటలోనే స్కానింగ్‌ పూర్తి చేసి దస్త్రాలు యజమానికి అప్పగించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్కానింగ్‌, వీడియో రికార్డింగ్‌ కోసం రూ.100 వరకు వసూలు చేయనున్నారు. టెండర్ల ద్వారా ప్రైవేటు ఏజెన్సీని ఎంపిక చేశాక ఛార్జీ ఎంత అనేది నిర్ణయించనున్నారు.

రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ చిరంజీవులు మాట్లాడుతూ.. త్వరలోనే ఏజెన్సీని ఎంపిక చేసి, ఛార్జీని నిర్ణయిస్తామని, గంటలోనే ఆ కాగితాలు యజమానులకు అందించాల్సిన బాధ్యత ఆ ఏజెన్సీపైనే ఉంటుందన్నారు. ఒక వేళ జాప్యం జరిగితే ఏజెన్సీకి జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించామన్నారు.వినియోగదారులకు వేగవంత, పారదర్శక సేవలు అందించేందుకు ఈ సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Share This Post
0 0

Leave a Reply