ఆర్టీసీ మూసివేత అసాధ్యం

రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నట్లుగా ఆర్టీసీని మూసేయడం, ప్రైవేటీకరించడం అంత సులభం కాదని అఖిలపక్ష నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటుపరం చేయడం సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ ప్రైవేటీకరించాలంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మంగళవారం మగ్దూం భవన్‌లో జేఏసీ, అఖిలపక్ష నేతలు సమావేశమై.. ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. ఆర్టీసీ కేంద్ర రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఏర్పడిన సంస్థ అని, దీనిని ప్రైవేటీకరించాలంటే కేంద్ర ఆమోదం పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోర్టులో కొనసాగుతున్న కార్మికుల న్యాయపోరాటాన్ని నీరుగార్చడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపింపించారు. ఇది ముఖ్యమంత్రి ఎత్తుగడగా కార్మికులు, ప్రజలు గుర్తించాలని కోరారు. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే.. సుప్రీంకోర్టు వరకు వెళతామనడం బెదిరింపు చర్యగా భావిస్తున్నామని తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు భయపకుండా సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 6న అన్ని డిపోల ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులతో కలిసి బైఠాయించాలని సూచించారు. 7న అన్ని డిపోల ముందు ప్రజా సంఘాల ప్రదర్శనలుంటాయని, 9న జరిగే చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. సంస్థపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ప్రభుత్వం పాటించాల్సిన అంశాలను వివరించారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్‌ ఇ.అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్లు కె.రాజిరెడ్డి, సుధ, టీజేఎస్‌ అధ్యక్షుడు, కోదండరాం, కాంగ్రెస్‌ నేత వి.హన్మంతరావు, బీజేపీ నాయకుడు మోహన్‌రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు.

Share This Post
0 0

Leave a Reply