అసలు ఎవరీ డొక్కా సీతమ్మ ? బ్రిటిష్ రాజు ఆహ్వానాన్నే వద్దన్నారా ?

ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన తరపున డొక్కా సీతమ్మ శిబిరాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఎవరు అనే అనుమానం చాలా మందికి కలగచ్చు. అందుకే ఆమె గురించి కొంత మేర ఉన్న సమాచారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం.

‘డొక్కా సీతమ్మగారూ – మీరు నా పట్టాభిషేక వార్షికోత్సవానికి అతిథిగా ఇంగ్లండ్‌ రావాలి…మా ఆహ్వానాన్ని మన్నించాలి. ’సాక్షాత్తూ బ్రిటీష్‌ ఇండియా చక్రవర్తి 7వ ఎడ్వర్డ్‌ 1903లో ఒక తెలుగు దేశం మహిళకి పంపిన పత్రమిది. అదేంటి ఒక తెలుగు మహిళకి బ్రిటీష్ చక్రవర్తి నుండి లేఖ రావడం అనుకుంటున్నారా ? ఆమె డొక్కా సీతమ్మ. తూర్పు గోదావరి జిల్లాలో సీతమ్మ అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా ఉంది(ఈ మధ్య కట్టారు). ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టాలనుకునే ఆమె దీక్ష ఎంత గొప్పవంటే – ఆవిడ తన జీవితములో ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారట. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద బోయీలు అలసి పల్లకి ఆపారట.

అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు “ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం అక్కడ సీతమ్మ గారు అన్నం పెడతారు” అని మాట్లాడుకోవటం విన్న సీతమ్మ గారు వెంటనే అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పి వాళ్ళకి అన్నం పెట్టాలని వెళ్ళిపోయారట. అలంటి మహా తల్లి సముద్రాలూ దాటి వెళ్లి ఆ కార్యక్రమానికి వెళ్తుందా ? అందుకే ఆ ఆహ్వానానికి సీతమ్మ ‘క్షమించండి. నేను రాలేను’ అని బదులిచ్చింది. దీంతో తూర్పు గోదావరి జిల్లా కలక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, “నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకలు ఎందుకు, వద్దు” అన్నారు ఆవిడ. “అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం.

మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు” అని ఆ కలక్టరు గారు చెబితే, “నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి” అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం.

Share This Post
0 0

Leave a Reply