అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే

అక్రమ నిర్మాణాలు చేపడితే ఎలాంటి నోటీసు లేకుండా వాటిని కూల్చే అధికారం నూతన పురపాలక చట్టంలో ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దీనిని అమలు చేసే బాధ్యత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులదేనని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. టౌన్‌ ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలపైనా కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. నిర్మాణ అనుమతుల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గవద్దని సూచించారు. భవన నిర్మాణాలకు అత్యంత పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇచ్చే నూతన విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందన్నారు. ప్రతి మునిసిపాలిటీకి ఒక మాస్టర్‌ ప్లాన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కాగా, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికోసమే ప్రత్యేకంగా వి-హబ్‌ నెలకొల్పామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం వి-హబ్‌, స్టార్టప్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశంలోని మొత్తం పారిశ్రామికవేత్తల్లో కేవలం 13.3ు మంది మాత్రమే మహిళలు ఉన్నారని, ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘వింగ్‌’ పథకంలో భాగంగా తెలంగాణలో 500 మంది మహిళలకు శిక్షణకు ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ఆసక్తి కలవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్టార్టప్‌ ఇండియా ప్రతినిధి దీక్షా నిగమ్‌ పాల్గొన్నారు.

Share This Post
0 0

Leave a Reply