అకస్మాత్తుగా ఆపుతుండటంతో కింద పడిపోతున్న ప్రయాణికులు

మెట్రో ప్రయాణం చల్లగా, హాయిగా సాగుతున్నా అడపాదడపా సాంకేతిక సమస్యలతో కుదుపులు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. మార్గమధ్యలో ఉన్నఫళంగా మెట్రో ఆగినట్లు ఆగి ముందుకు సాగుతుండటంతో నిలబడిన ప్రయాణికులు పడిపోతున్నారు. పదేపదే కుదుపులతో ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న మెట్రోలో ఇతర సాంకేతిక సమస్యలు ప్రయాణికులను తరచూ చికాకు పెడుతున్నాయి. ఆరంభంతో పోలిస్తే నెలలు గడిచే కొద్దీ సాంకేతిక సమస్యలు సర్దుబాటు కావాలి. మెట్రో రైల్లో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఆకాశమార్గంలోని వయాడక్ట్‌లపై ఉన్న ట్రాక్‌లపై ఎవరూ అడ్డొచ్చే పరిస్థితి ఉండదు. మెట్రో వెళ్తూ వెళ్తూ ట్రాక్‌పై ఎవరో అడ్డు వచ్చినట్లుగా బ్రేక్‌ వేస్తుండటంతో కుదుపులకు గురవుతున్నారు. ఇలా ఎందుకు పదేపదే వస్తున్నాయో అర్థం కాక ప్రయాణికులు తికమక పడుతున్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో న్యూమలక్‌పేట దగ్గర మెట్రో కుదుపుతో రైల్లో నిలబడిన చాలామంది ప్రయాణికులు ఒక్కసారిగా పడిపోయారు. నిల్చున్న వారు సీట్లలో కూర్చున్న వారిపై పడ్డారు.

తలుపులు తెరుచుకోక..
స్టేషన్‌ రాగానే మెట్రో తలుపులు తెరుచుకుంటాయి. కొన్నిసార్లు మొరాయిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఎంజీబీఎస్‌ స్టేషన్‌లో మెట్రో ఆగినా తలుపులు తెరుచుకోలేదు. దీంతో
ప్రయాణికులు తర్వాతి స్టేషన్‌లో దిగి ప్లాట్‌ఫాం మారి మరో మెట్రో ఎక్కి వెనక్కి వచ్చారు. మూడురోజుల క్రితం అమీర్‌పేట స్టేషన్‌లో ఎల్‌బీనగర్‌ వెళ్లే మెట్రో మిగతా కోచ్‌ల తలుపులు తెరిచి ఉండగా ఒక కోచ్‌ తలుపులు మూసుకోవడంతో ప్రయాణికులు అందులోనే ఇరుక్కుపోయారు. ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో మిగతా స్టేషన్ల కంటే రద్దీ ఎక్కువ. ఇక్కడా మిగతా స్టేషన్ల మాదిరే స్వల్ప సమయమే ఆపడంతో చాలామంది మెట్రో ఎక్కబోతూ తలుపుల్లో ఇరుక్కుంటున్నారు.

Share This Post
0 0

Leave a Reply